రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. సోమవారం న్యూఢిల్లీలో పర్యటించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ‘హడ్కో’ అధికారులతో సమావేశమయ్యారు. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ట, హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ ఎన్ మూర్తి పాల్గొన్నారు.
అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్డీయేకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపారు. అమరావతి ఫేజ్-1 నిర్మాణానికి రూ.26 వేల కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిధులకు సంబంధించి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలుపగా తాజాగా హడ్కో కూడా రూ.11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపింది. అంటే మొత్తం దాదాపు రూ.26 వేల కోట్ల నిధులు సర్దుబాటు అయినట్లే. ఈ నిధులు విడుదల అయితే రాజధాని పనులు శరవేగంగా ముందుకు సాగనున్నాయి.