ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన రాజకీలయాల దృష్ట్యా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6,100 టీచర్ పోస్టులకు జగన్ సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తైంది. సరిగ్గా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. మరోవైపు అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలకు దిగారు. ఇంతలో కూటమి సర్కార్ అధికారం చేపట్టింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీని రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతకం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి – మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక నేడో, రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా నిర్వహించనున్నారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు! కారణం ఇదే..
