ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4.95 లక్షల మంది మహిళలు దీపం పథకంకు అర్హులుగా ఉన్నారు.
రేపు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరులో, గజపతినగరం మండలం పురిటిపెంటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గంగచోళ్ల పెంట వద్ద హెలీప్యాడ్ ను ఏర్పాటు చేశారు. పురిటిపెంటలో రూ.826 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా చేయనున్న రోడ్ల మరమ్మతు పనులను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే రోడ్డుపై ఏర్పడిన గుంతల్ని పూడ్చే పనుల్లో పాల్గొననున్నారు.