ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన చర్యలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో ప్రజలకు మనమంతా భారత సైన్యంతో ఉన్నామనే స్పష్టమైన సందేశం వెళ్లాలన్నారు. రాజకీయాలకు, పార్టీ లకు తావు లేకుండా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా పని చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవల శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని, వారు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షల్లో పాల్గొనాలని, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలని ఆదేశించారు.
రెడ్ క్రాస్ సమన్వయంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలని, అత్యవసర మెడిసిన్ స్టాక్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి, సమాచారం తీసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య సమాచారం పంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో ఆందోళన పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ప్రకటనల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి అనధికారికంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీస్ శాఖ కఠిన నజరం ఉంచాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి తలెత్తిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.