అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటు చేసుకుంది. దళిత నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ (58) దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం సన్నిహితులతో కలిసి గుంతకల్లు వెళ్తుండగా గుంతకల్లు శివారులో కాపు కాచిన దుండగులు ఆయన వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు. తరువాత మారణాయుధాలతో దాడి చేసి చిప్పగిరి లక్ష్మీనారాయణను దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనలో ఆయన కుమారుడు వినోద్, సోదరుడి కుమారుడు గోవిందు కూడా వాహనంలో ఉన్నారు. కారులో చిక్కుకున్నవారిని స్థానికులు వెలికితీశారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని పోలీసులు భావిస్తున్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో చిప్పగిరికి చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి, వైకుంఠం వెంకటేశ్‌చౌదరి హత్యలు జరిగాయి. అదే మండలం ఏరూరుకు చెందిన మూస దారుణ హత్యకు గురయ్యాడు. చిప్పగిరి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉన్న పోలీస్ పికెట్‌ను పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఎత్తేసినట్లు మృతుడి సోదరుడి కుమారుడు గోవిందు ఆరోపించారు. ఆయనకు ఎప్పటినుంచో ప్రాణహాని ఉందని, హోంమంత్రి, కర్నూలు జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.