లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ మరింత బలహీనపడుతూ వస్తోంది. గతంలో కేసీఆర్‌ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే.. అధికారం పోయే సరికి.. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్-కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ చాలామంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం 9 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనసభా పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9మందిని చేర్చుకోగా.. మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని.. ఇద్దరు నుంచి ముగ్గురే ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు హీరో అన్నారునేడు జీరో అంటున్నారు..
