కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది.
తప్పుడు కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్, దాని ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తనపై ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను, ఆర్టికల్స్, పోస్టులు, వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ అనుబంధ పిటిషన్‌లో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.