ఎక్కడచూపినా జ్వరం, ఒళ్లునొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాలు మంచాన పడుతున్నాయి. పల్లెనుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వైద్యం కోసం ఆసుత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో పలు చోట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. దోమల దాడి కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డెంగ్యూ ఫీవర్ పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను విలువు దోపిడీ చేస్తున్నాయి. తరుచూ కురుస్తున్న వర్షాలకు, మరోవైపు వేసవిని తలపించే ఎండలు వాతావరణంలో మార్పులు రావడంతో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి.
నెలరోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. విష జ్వరాల బారిన పడిన వారిలో పిల్లలు అధికంగా ఉన్నారు. ప్రధానంగా డెంగీ లక్షణాలతో వస్తున్న వారు అధికంగా ఉంటున్నారు. ఆ తర్వాత స్థానంలో మలేరియా కేసులు ఉంటున్నాయి. జిల్లా వైద్యారోగ్య అధికారులు చెబుతున్న లెక్కలకు ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి రాని డెంగ్యూ కేసులు జిల్లాలో వందల సంఖ్యలోనే ఉంటాయని సమాచారం.