తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తిరుమల శ్రీవారు అందరికీ చెందిన వాడని తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకుంటారని గుర్తు చేశారు. గతంలో ఏపీ తెలంగాణ విడిపోయిన సమయంలో తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని ఎటువంటి వివక్ష చూపించలేదని, వైసీపీ హయాంలో కూడా ఎటువంటి వివక్ష లేదని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ భక్తులపై తిరుమలలో వివక్ష చూపుతున్నారని అన్నారు. సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ, వ్యాపార వేత్తల విషయంలో వివక్ష కొనసాగుతుందని శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.