ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వివాదం విషయంలో గచ్చిబౌలి పోలీసులు గాంధీకి షాకిచ్చారు. గాంధీతో పాటు అతని సోదరుడు, కుమారుడుపైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్లపైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను పోలీసులు నిందితులుగా చేర్చారు. కౌశిక్ ఇంటి వద్ద ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే గాంధీపై కేసు నమోదైంది. ఆ కేసులో ఎమ్మెల్యే గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే గత మూడు రోజుల నుంచి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..
