ఉదయం లేవగానే తీవ్రమైన అలసటతోపాటు ప్రతిరోజూ నడుము నొప్పి వేధిస్తోందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మీ కిడ్నీలు రిస్క్‌లో ఉన్నాయని చెప్పడానికి గల లక్షణాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు పక్కటెముకల కింది భాగాన, పొత్తి కడుపులో ఒక వైపున మాత్రమే తరచుగా నొప్పి వంటివి వస్తుంటాయి. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీల పనితీరు..
మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటనే విషయం తెలిసిందే. ఇవి శరీరంలో చెడు రక్తాన్ని వడబోసి అందులోని వ్యవర్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీల పనితీరు ఏమాత్రం మందగించినా అనారోగ్యాలు సంభవిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తీవ్రమైన నొప్పి..
ఉదయంపూట పక్కటెముకలు లేదా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి మొదలై అది గజ్జలు లేదా తొడలకు వ్యాపిస్తుంది. అలాగే మధ్య మధ్యలో నొప్పి తీవ్రంగా వచ్చి, కొంత సమయం తగ్గి మళ్లీ రావచ్చు
యూరిన్‌లో మార్పులు..
మూత్రంలో రక్తం పడటం, రంగు మారడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయనడానికి సంకేతాలు. అలాగే యూరిన్ కలర్ గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు. దీంతోపాటు దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లేదా చాలా తక్కువ పరిమాణంలో మూత్రం రావడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని తెలిపే సంకేతాలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వికారం, వాంతులు..
ఉదయం లేవగానే వికారం, వాంతులు రావడం, జలి జ్వరం వచ్చి కాసేపటి తగ్గడం, మళ్లీ రావడం వంటివి కూడా కిడ్నీల పనితీరు మందగించిందని లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియజేసే ప్రధాన సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాళ్లు, చీలమండల భాగాలు, ముఖం లేదా చేతులలో తరచుగా వాపు రావడం కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయడం వల్ల సంభవిస్తుంది.
ఏం చేయాలి?..
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం లేదా వాటి పనితీరు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. తగిన చికిత్స ద్వారా పరిష్కారాన్ని అందిస్తారు. అయితే పరిస్థితి ఇంత వరకు రాకుండా ఉండాలంటే రోజువారి జీవితంలో తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. రోజుకు 2.5-3 లీటర్ల నీరు తప్పక తాగాలి. దీంతో కడ్నీల్లో ఉండే చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.