గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో నిన్న వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పలు చోట్ల మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో చేతికి అందివచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.