రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. ఈ క్రమంలో రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా, ఈ ప్రభావంతో ఈనెల 23వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సిసోడియా తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోందని, ఫలితంగా ఈనెల 24వ తేదీ నుంచి అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వివరించారు.