పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయన అనుచరులను రావడానికి వీళ్లేదని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పెద్దకూరపాడు మండలంలో కొన్ని ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శంకర్ రావు తన అనుచరులతో కలిసి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో 14వ మైలురాయి వద్ద టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది.
టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా నంబూరి శంకరరావు మండిపడ్డారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణమని అన్నారు.