హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి. తగ్గిన చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు అమలులో ఉంటాయి. ఇక, హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌గేట్లు ఉన్నాయి.
ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరు వైపులా కలిపి రూ.30, లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు ప్రకటించారు. అయితే, చిల్లకల్లు టోల్‌ప్లాజా దగ్గర అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే రేట్లు తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.