హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), జీఎమ్మార్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు జులై ఒకటి నుంచి ఎన్‌హెచ్‌ఐఏనే టోల్ వసూలు చేయనుంది. ఇవీ వివరాలు… మొదట్లో రెండు వరుసల్లో ఉన్న ఈ రోడ్డును బీవోటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండరు పిలిచింది. జీఎమ్మార్ గుత్తేదారు సంస్థ రూ.1740 కోట్లకు టెండర్ వేసి, పనులను దక్కించుకుంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబరులో పనులను పూర్తి చేసి, తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది. ఈలోపే జీఎమ్మార్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించడం గమనార్హం.
కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యం హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే ఆరు వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. నాడు టెండరు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థే హైవేను 2024 వరకు ఆరు వరుసల్లో విస్తరించాలనేది ఒప్పందం. కానీ.. తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎమ్మార్ కోర్టును ఆశ్రయించింది. ‘‘అప్పట్లో రవాణా వాహనాలు ముఖ్యంగా ఇసుక కోసం లారీలు ఏపీకి భారీగా వెళ్లేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది’’ అని పేర్కొంది. ఈ కారణంగా విస్తరణ ఆగిపోయింది. జీఎమ్మార్, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య అనేక చర్చల అనంతరం… గడువు కన్నా ముందే టోల్ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎమ్మార్ అంగీకరించింది. దాంతో ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకొంది. ఎంత, ఎప్పటిలోగా చెల్లిస్తుందనే సమాచారం బహిర్గతం కానప్పటికీ రెండు దఫాలుగా ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి..
