ఏపీ ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ వాతావరణశాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-4, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురం మన్యం జిల్లాలో-8 మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మే తొలి వారంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతుంది. వాతావరణశాఖ. వచ్చే నెల రోజుల్లో ఎల్‌నినో తటస్థంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మే మొదటి వారంలోనే సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వానలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.