తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక సాయంత్రం ఐదు దాటితే చాలు చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికి తోడు ఈదురు గాలులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.