రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన చలిగాలులు మరుసటి రోజు ఉదయం 10 గంటల తర్వాత కూడా తగ్గడం లేదు. బయటకు వాళ్లేవారే కాదు ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలులు కొనసాగుతుండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు బయటకు రావాలంటే చలికి గజ గజా వణికిపోతున్నారు. సోమవారం పటాన్ చెరువులో 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది.