76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా..

republic-day-25.jpg

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే భారత్ విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది.

భారత పర్యటనలో భాగంగా సుబియాంటో ఇండియాతో ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మరోవైపు ఆదివారం(జనవరి 26) జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరించారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది. ప్రోబోవో సుబియాంటో భారత్‌లో పర్యటించిన తర్వాత పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు. ఈ కారణంగా, భారతదేశం ముఖ్య అతిథి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ప్రోబోవో సుబియాంటో తన భారత పర్యటన తర్వాత నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లాలని అనుకున్నారు. అందుకు భారత్ దౌత్య నీతి ప్రదర్శించడంతో సుబియాంటో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకున్నారు.

Share this post

scroll to top