గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల మధ్య జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంలో ప్రీ-రిలీజ్ వేడుకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుక ఘనంగా జరిగినప్పటికీ అత్యధిక మంది అభిమానులు హాజరు కావడంతో విషాద ఘటన చోటుచేసుకుంది.
అయితే ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ తోకాడ చరణ్ అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైమ్‌లో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు. ఈ సంఘటనపై ఇప్పటికే పవన్ కళ్యాణ్, దిల్ రాజు స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ క్రమంలో.. తాజాగా, అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు.