ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆరోపణలు ఎదురుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. పాలక్కాడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు సీఎం పినరయ్ విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబి రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కవితనే స్వయంగా వచ్చి కేరళలో నడిపించారని తెలిపారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని తెలిపారు.
ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని సతీశన్ ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్‌లోని డిస్టిలరీలకు కూడా తెలియదని వెల్లడించారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు. ఈ మొత్తం ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ కామెంట్స్ చేసిన ఆయన కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారనే వివరాలపై విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.