ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది. అయితే, కొంత మంది యువకులు ఆ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను అపహరించి వీరపనేని గూడెం శివారు ప్రాంతంలో మూడు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
మూడో రోజు గన్నవరం మండలం కేసరపల్లి శివారు ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని వద్దకు బాలికను తీసుకెళ్లిన యువకులు. మళ్లీ పాశవికంగా ఆ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలికను ఒక ఆటో ఎక్కించి విజయవాడలో దింపమని చెప్పి పంపించారు యువకులు. ఇక, ఆటో డ్రైవర్ సహాయంతో విజయవాడ పోలీసులను ఆశ్రయించిన బాలిక. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది. దీంతో, ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ నుండి ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు కేసును పంపగా సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 8 మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు పదో తరగతి పరీక్ష రాసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు.