వరల్డ్ క్లాస్ మెడికల్ ట్రీట్‌మెంట్ ఎక్కడో అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ అంతకంటే గొప్ప చికిత్సా విధానం మన హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వైద్యపరికరాలు, నిష్ణాతులైన వైద్యులు.. వెరసి భాగ్యనగరం మెడికల్ టూరిజం హబ్ గా అవతరిస్తోంది. అవును.. వైద్య చికిత్స కోసం దేశ, విదేశాల చూపు.. ఇప్పుడు హైదరాబాద్ వైపు ఉంది. పలు రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్.. మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్కుతోంది. బెస్ట్ ట్రీట్మెంట్.. అదీ తక్కువ ఖర్చుతోనే కావాలనుకునే విదేశీ మెడికల్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కొలువు దీరాయి. రాకెట్ వేగంతో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. అటు నిర్మాణం రంగానికి తిరుగులేదు. శాంతిభద్రతలకు ఢోకాలేదు. మానవ వనరులకు కొదవలేదు. ఇలా సకల రంగాల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్.. మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన వైద్య చికిత్స అనగానే ఇప్పుడు తన వైపు చూసేలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది హైదరాబాద్. విదేశాల్లో కూడా సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా చేసి చూపించాయి ఇక్కడి ఆసుపత్రులు. గత పదేళ్లుగా చూసుకుంటే హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు ఓవర్సీస్ పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్, మిడిలీస్ట్ దేశాలు ఒమన్, ఇరాక్, యెమన్, ఇటు పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘన్ నుంచి కూడా రోగులు హైదరాబాద్ ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. అటు సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నుంచి కూడా మన భాగ్యనగరానికి వస్తున్నారు.
తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యంమెడికల్ టూరిజానికి హబ్‌గా హైదరాబాద్..
