పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను జనసేన ప్రజా ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ఉన్నామని… మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని మంత్రి సూచించారు.
పదవులు మనకొచ్చాయి.. కానీ మనం కోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలి. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. నిజాయితీగా పని చేయాలి. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసింది. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం’’ అని చెప్పుకొచ్చారు.