విజయనగరం జిల్లా పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగడంతో గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో జిల్లాలో రాజకీయ పార్టీల హడావుడి కూడా మొదలైంది. ఇది వైసీపీ సిట్టింగ్ సీటు. మరోసారి తమ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది.
విజయనగరం జిల్లాలో 753 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 548 మంది వైసీపీ ఓటర్లు, 156 మంది టీడీపీ ఓటర్లు, 13 మంది జనసేన, 13 మంది స్వతంత్ర ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కొంతమంది లోకల్ బాడీస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఆ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఎంత మంది వెళ్ళినా ఇప్పటికీ మెజారిటీ వైసీపీకే ఉంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా 375 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అంటే నూరు శాతం ఓటింగ్ పడినప్పుడు. అలా కాకున్నా 350 ఓట్లు వచ్చినా గెలిచినట్లే. వైసీపీకి ఉన్న 548 మంది బలాన్ని చూసుకుంటే ఉండాల్సిన దానికంటే 200 మంది లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల మద్దతు ఎక్కువగా ఉంది. ఇందులో నుంచి పెద్దసంఖ్యలో ఓటర్లను లాగేస్తే తప్ప కూటమి గెలవడం కష్టం. అందుకే ఓట్లు తక్కువగా ఉన్న సీటులో బరిలోకి దిగాలా? వద్దా? పోటీ చేస్తే గెలుస్తామా? ఒకవేళ ఓడిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయా? అని కూటమి నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నట్లు టాక్.