సంక్రాంతి పండుగ వేళ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అధికారుల సైతం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్.చక్రవర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా వేట్రీ సెల్వి అధికారులు ఆదేశించారు.
సంక్రాంతి సంబరాల పేరిట జంతుహింస జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జూదాలు జరుగకుండా చూసేందుకు జిల్లాలో అన్ని మండలాల్లో 28 సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు గట్టినిఘాతో తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కమిటీల్లో మండల తహశీల్దారు, ఎస్ హెచ్ఓ, ఎన్ జివో ప్రతినిధి, ఇద్దరు కానిస్టేబుల్స్, ఇద్దరు వీడియో గ్రాఫర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు.