కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో హన్మకొండకు వెలుతారు. సాయంత్రం 5.30గంటలకు ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం సుప్రభ హోటల్ లో కొంత సేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ట్రైన్ లో స్టూడెంట్స్ తో ప్రొగ్రాంకు ఆయన వెళ్తారు. రాత్రి 7:30కు అక్కడి నుంచి తమిళనాడుకు బయలుదేరుతారు.
రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం వెనుక రాజకీయ కారణాలు ఏమిటన్నదానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాహుల్ రాష్ట్ర పర్యటన నేపధ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీపీ కమిటీ నిర్మాణంకు సంబంధించి ఏమైనా సంకేతాలు వెలువడుతాయా అన్నదానిపై పార్టీ వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాహుల్ గాంధీ ఆకస్మిక రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది.