వేధింపులకు భయపడేది లేదు..

nani-01.jpg

కూట‌మి ప్ర‌భుత్వ వేధింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పేర్ని నాని స్ప‌ష్టం చేశారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని మండిపడ్డారు.  రేషన్‌ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఏ పాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమ చేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.

మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్‌ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత  ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్‌.. సీజ్‌ ద గోడౌన్ అన్నా ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై  క్రిమినల్‌ కేసులు పెట్టారు. ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ  వైయ‌స్ఆర్‌సీపీ నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ వైయ‌స్ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

Share this post

scroll to top