పాపం ఎలుకలదా? సిబ్బందిదా..?

psd1-copy.jpg

2015, ఆగస్ట్‌లో విజయవాడకు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యం బాలేకపోవడంతో జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు శిశువును ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయితే ఎలుకల దాడిలో బాబు చనిపోవడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్యంపై అప్పటి ప్రభుత్వం దృష్టి సారించింది. వారం రోజుల పసికందును పొట్టన పెట్టుకున్న మూషికాలను తుద ముట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా వంద మంది పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు.

సోమవారం ఎలుకలు వైర్లు కొరికివేయడంతో రోగులకు చుక్కలు కనిపించాయి. ఓపీ రిజిస్ట్రేషన్లు దాదాపు గంట సేపు నిలిచిపోయాయి. దీంతో ఓపీ క్యూ లైన్లు అన్ని కిటకిటలాడాయి. సోమవారం ఉదయం కూడా పెద్ద ఎత్తున రోగులు ఉదయం ఆరుగంటల నుండే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే ఎనిమిది గంటలకు విధులకు హాజరైన సిబ్బంది రిజిస్ట్రేషన్స్ చేసేందుకు సిద్దమవ్వగానే కంప్యూటర్స్ మోరాయించాయి. దీంతో ఏమైందోనన్న ఆందోళన సిబ్బందిలో మొదలైంది. అయితే కంప్యూటర్స్ కనెక్షన్స్ తోపాటు ఇంటర్ నెట్ వైర్లను ఎలుకలు కొరికి వేసినట్లు గుర్తించారు.

వెంటనే సిబ్బంది రిపేర్ చేసే వ్యక్తులను పిలిపించి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గంట తర్వాత కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పటికే పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోగులు ఇంత ఇబ్బందులు పడుతున్న సిబ్బంది పట్టించోకోవడం లేదని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  రానున్న రోజుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. గుంటూరు జనరల్ ఆసుపత్రి అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Share this post

scroll to top