మండుటెండలకు ఉపశమనంగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ అకాల వర్షాల వల్ల రైతన్నలు లబోదిబోమంటున్నారు. పంట చేతికివచ్చే సమయంలో, ధాన్యం ఆరబోసిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో 41-42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
మే 5,6 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూల్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.