ఇప్పటికే వరుస ఓటములతో, ఎమ్మెల్యేల వలసలతో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు చూసే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఆయన తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు రంకెలేస్తుంటే తాము చూస్తూ ఉండాలా? అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చేరికలపై పై విధంగా స్పందించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అనూహ్యంగా హరీశ్‌రావును టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో మరింత దుమారం రేపింది. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కాదని హరీశ్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టడం వెనక మతలబు ఏంటనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య మొదలైన బీ-టీమ్ దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌కు నష్టం కలిగించాయని నిన్న ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారగా, ఈ ఆరోపణలను ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు కొట్టిపారేశారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోగా ఈ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కేసీఆర్, కేటీఆర్‌పై పార్టీలో ఓ వర్గం గుర్రుగా ఉందనే చర్చ జరుగుతోంది. పార్టీని నమ్ముకున్నవారిని కాదని వలస నేతలనే ప్రోత్సహించారని మొన్నటికి మొన్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నా వలస నేతకే టికెట్ ఇచ్చారనే విమర్శలు వినిపించాయి.
రేవంత్ మాస్టర్ స్కెచ్ ఆ ఇద్దరు కాదు.. అతడే టార్గెట్?
