సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేవారికి గుడ్ న్యూస్ రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అవి బయల్దేరే సమయం, తేదీ వంటి పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ టైన్లకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిజర్వేషన్ సౌలభ్యం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్లు హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.
కాచిగూడ – కాకినాడ టౌన్ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్ -కాచిగూడ రైలు (07654) జనవరి 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. హైదరాబాద్ – కాకినాడ టౌన్ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని, తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీఆర్వో ఎ.శ్రీధర్ సూచించారు.