ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న సదస్సులో రెండో రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా సామాజిక పింఛన్లలలో సుమారు 6 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా అనర్హులున్నారని స్వయాన సంబంధిత మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించడంతో ప్రభుత్వం షాక్‌కు గురయింది. రాష్ట్రంలో మొత్తం 64 లక్షల మంది అన్ని రకాల పింఛన్‌దారులుండగా దివ్యాంగుల కోటాలో అత్యధికంగా అనర్హులున్నారంటూ సదస్సులో వివరించారు.
అయితే వైసీపీ హయాంలో సదరం క్యాంపులు నిర్వహించి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్టిఫికేట్లు జారీ చేశారని గుర్తించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు 10,958 పింఛన్లలో సుమారు 563 మంది అనర్హులున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం గురువారం నాటి కలెక్టర్ల సమావేశంలో అనర్హులపై కీలక ఆదేశాలు జారీ చేసింది.