మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..

maharastra-26-.jpg

మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజుతో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో సీఎం పదవిపై కూటమిలో వాదనలు, ప్రతివాదనలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోసం పట్టుబడుతుండగా ఇంకోవైపు ఏక్ నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శివసేన వర్గం డిమాండ్ చేస్తోంది. సీఎం పదవికి సంబంధించి ఢిల్లీలోనే నిర్ణయం తీసుకుంటారని మొదట చర్చ కొనసాగింది. ఈ పరిణామాలన్నింటిలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం హస్తినకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే వచ్చేశారనే చర్చ కొనసాగుతుంది.

కాగా, మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీయే కూటమికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల కలయికతో విజయం సాధించిన మహయుతి కూటమిలో ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 132 స్థానాల్లో గెలుచింది.

Share this post

scroll to top