నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది. నందమూరి తారకరామారావు సినిమా ప్రారంభానికి సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరికొందరు హాజరయ్యారు.
ఈ సినిమా ప్రారంభం సందర్భంగా హీరో, హీరోయిన్లపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి క్లాప్ కొట్టగా పురంధేశ్వరి, లోకేశ్వరి కెమెరా ఆన్ చేశారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘స్వర్గీయ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తారక రామారావు తొలి చిత్రం ఈరోజు ప్రారంభం అవుతున్నందున అతను గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తారకరామారావు ఫొటోను యాడ్ చేశారు.