తప్పుడు మార్గంలో వెళ్లకుండా మనల్ని రక్షించేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. వారు జీవితంలోని తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తారు. సమాజంలో మనల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు, సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉంటారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం టీచర్ చేస్తున్న ప్రయత్నాలకు మీ కృతజ్ఞతలు తెలిపే రోజు వచ్చింది. కాబట్టి మీరు మీ ఉపాధ్యాయులను స్మరించుకొని వారిని నమస్కరించుకోండి.
ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే నేర్పరు. విలువలు గురించి, జీవితంలోని మంచి చెడుల గురించి, సమాజం పట్ల మంచి భావనల గురించి కూడా బోధిస్తారు. ఇక వారి శ్రమకు గుర్తుగా సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం. నిజానికి భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, ఆపై రెండవ రాష్ట్రపతిగా, ప్రముఖ తత్వవేత్తగా, ఉపాధ్యాయుడుగా సేవలను అందించారు. ఆయన విద్యార్థుల బాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేసేవారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.