తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మార్చి 21నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ సైతం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యకేషన్ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన మెనూకూడా విద్యాశాఖ అధికారులు రూపొందించారు. ఆరు రకాల స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15చొప్పున ఖర్చు చేయనున్నారు. స్నాక్స్ రూపంలో ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లీపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖతాల్లో వేయనున్నారు.