బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వర్షం కాస్త ఊరటనిచ్చినట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆగస్టు 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సూర్యాపేట, మహబూబ్, వరంగల్, సూర్యపేట, హనుమకొండ, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.