మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ట్విట్టర్ వేదిక ద్వారా విమర్శించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసమని నిలదీశారు.