తిరుమల లో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అపచారాలు వివాదస్పదమవుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శన ప్రక్రియలో అమలులో ఉన్న డ్రెస్ కోడ్ ఉల్లంఘన ప్రస్తుతం కొత్త వివాదాన్ని రేకెత్తించింది. డ్రెస్ కోడ్ మేరకు శ్రీవారి దర్శనం సందర్భంగా ధరించాల్సిన సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలిని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి. పురుషులైతే ధోతీ కుర్తా పైజమా ధరించాలి. మహిళలు పంజాబీ డ్రెస్, లంగా వోణి, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఓ మహిళ టీ షర్ట్, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం అలాగే టీడీడీ సిబ్బంది ఆమెను దర్శనానికి అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారుల తీరు చూస్తుంటే తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామన్నట్లుగా ఉందంటూ భక్తులు టీటీడీ సిబ్బంది వైఖరిని తప్పుబడుతున్నారు.