బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు. హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్ల మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు టెక్నికల్‌గానూ వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రెటీల పై మియాపూర్ పోలీసుకు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ సహా 25 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితోపాటు శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీయాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.