హిమాయత్ నగర్ పర్యాటక భవన్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోవడం, హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనం ఇవ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితా తయారు చేయాలని వెంటనే ఆదేశించారు. హాజరుశాతం, ఉద్యోగులు పనితీరుపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ఉన్నతాధికాల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సుస్పష్టం చేశారు.
పర్యాటక భవన్ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూపల్లి..
