ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు టెన్షన్ పడుతున్నారు. కారణం తుంగభద్ర నదీ ప్రాజెక్టు. తాజాగా ఈ ప్రాజెక్టులోని 19వ గేట్ కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి వరద నీరు భారీగా కిందికి వస్తోంది. దాన్ని ప్రస్తుతం ఆపే పరిస్థితి లేదు. దాంతో అధికారులు ప్రాజెక్టు లెక్కలు బయటకు తీశారు. ఈ ప్రాజెక్టులో ఇప్పుడు 97 టీఎంసీల నీరు ఉంది. ఇది క్రమంగా తగ్గిపోతూ 40 టీఎంసీలకు తగ్గిన తర్వాత అప్పుడు కొత్త గేట్ పెట్టే వీలు కలుగుతుంది. అంటే 57 టీఎంసీల నీరు కిందకు పోయినట్లే.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ వరద నీరు చేరుతుందనే అంచనా ఉంది. నిజానికి శ్రీశైలం ఇన్‌ఫ్లో కొంత తగ్గింది. కానీ ఈ వరద నీరు రాబోతోందని తెలిసి అందుకు అనుగుణంగా ముందుగానే ఔట్ ఫ్లోను సరిచేశారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 87 వేల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లోని 1 లక్ష 90 వేల క్యూసెక్కులుగా ఉంచారు. ఇక తుంగభద్ర వరద కారణంగా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఆల్రెడీ నిండిపోయాయి. తుంగ భద్ర నీరు శ్రీశైలం ప్రాజెక్టును చేరాక, ఎంత నీరు వస్తోందో చూసుకొని, తెలంగాణలోని నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు ఎంత వదలాలో నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.
ప్రస్తుతం తుంగభద్ర దగ్గర పరిస్థితి అదుపులోకి వస్తోంది. కిందకు ప్రవహించే నీటి వల్ల చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, అధికారులతో వెళ్లి పరిస్థితిని గమనించారు. అలాగే నిన్న సీఎం చంద్రబాబు ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. మంగళవారం తుంగభద్ర ప్రాజెక్టును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చూస్తారు. మరోవైపు పోయిన గేటు ఏమైపోయిందో వెతికే పని జరుగుతోంది. కానీ అది దొరికేలా కనిపించట్లేదు. అటు కొత్త గేట్ల తయారీ మొదలైంది.