తిరుపతి తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఆయన దురదృష్ట పాదం ఆంధ్ర ప్రజలను బలిగొంటుందన్నారు. పుష్కరాలు బహిరంగ సభలు, తిరుపతి తొక్కిసలాట ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. వేలకోట్ల అప్పులు చేస్తున్న కూటమి ప్రభుత్వం అవినీతితో కోట్లు వెనకేసుకుంటు..అమాయకమైన భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా వారి మరణానికి కారణమైందని విమర్శించారు.
ఇలాంటి అసమర్థ ప్రభుత్వం ఏపీ ప్రజలకు అవసరమా అని మండిపడ్డారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేశారని, అతడిని ఉరి తీయాలన్నంతగా పచ్చ మీడియా రచ్చ చేసిందని, మరి ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితను బాధ్యులను చేస్తారా? అని నిలదీశారు. వారిలో ఎవరు నైతిక బాధ్యతగా బాధ్యత వహించి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. టీటీడీకి అసమర్థ చైర్మన్ బీఆర్.నాయుడును తప్పించి, సమర్థుడైన వారిని నియమించాలని, పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.