ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ షరతులతో అంగీకరించింది. ప్రభుత్వం కోరిన విధంగా నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించిందని, అయితే కొన్ని సూచనలు చేసిందని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ తెలిపారు. ఇవాళ జరిగిన సీఆర్డీయే 39వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు 15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, వరద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వరల్డ్ బ్యాంక్ సూచించిందని నారాయణ తెలిపారు. సీడ్ కేపిటల్ లో 48కిలోమీటర్ల మేర కాలువలు వస్తున్నాయని, క్యాపిటల్ సిటీ వెలుపల రెండో దశలో వరద నివారణ పనులు చేపట్టాలని మంత్రి తెలిపారు. వరద నివారణ పనులకు నెదర్లాండ్స్ నివేదిక ఇచ్చిందని, రెండో దశ వరద నివారణ పనులకు సమగ్ర నివేదిక తయారీకి అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి చుట్టూ బైపాస్ రోడ్లు వచ్చినా ఔటర్,ఇన్నర్ రింగ్ రోడ్లు ఉంటాయని వెల్లడించారు.