గత నెల మార్చి 30న పాపిరెడ్డి పల్లి లో లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను దుండగులు హత్య చేశారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ దిగజారి పోయాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని జగన్ మండిపడ్డారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బంగపాటు కలిగిందని జగన్ గుర్తు చేశారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ గెలిచిందని అన్నారు.
ఎన్నికల్లో టీడీపీ కి బలం లేకున్నా ఎన్నికల్లో నిలిచి పోలీసులతో పాలన కొనసాగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. సీఎంగా అధికారంలో ఉన్నాననే అహంకారంతో అన్ని ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. అలాగే పాపిరెడ్డి పల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో పోలీసులను ఉపయోగించి ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురి చేశారని స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు బెదిరింపులకు గురి చేశారని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.