పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని చెప్పారు.
నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించాం. మా ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలిచాం. 2014-19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేసాం.