ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లనని చెప్పే జగన్ ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని వెంటనే రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది. మీ మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని షర్మిలపై వైసీపీ పార్టీ మండిపడింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే చంద్రబాబుకు మద్దతు పలకడమే మీ అజెండా అని అర్థమవుతుందని విమర్శించింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలు కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా అని ప్రశ్నించింది. పావురాల గుట్టలో పావుమైపోయాడని వైఎస్సార్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా అని మండిపడింది. తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి.. అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా? అని షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. మీకన్నా పిరికివాళ్లు.. మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు.. మీకన్నా అహంకారులు.. మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అని నిలదీసింది. ఇంతకీ మీరు పోస్టు చేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా? అని నిలదీసింది.
ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదా షర్మిల..
