తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వారు చేస్తారని తెలిసి తెలియక తప్పులు చేసిన వారు ఈ దీక్ష చేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటేనన్నారు.
చంద్రబాబు కుళ్లిన మెదడుతో తిరుమల ప్రసాదంపై మలినపు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తిరుమల ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ పాపం దహించుకుపోవటంతో పవన్ ఈ దీక్ష చేస్తున్నారన్నారు. పవన్ హిందువు అని చెబుతున్నారా భీమవరంలో బాప్టిజం తీసుకున్నాను అని పవన్ చెప్పారు కదా అంటూ వ్యాఖ్యానించారు. జనం ఏ విషయం మర్చిపోరు అనే విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారు అనుకుంటా అంటూ ఆయన అన్నారు.హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి 400కి అమ్ముతున్నారన్నారు.